పవన్ వ్యాఖ్యలను సమర్థించిన పురంద్రీశ్వరి
పవన్ కల్యాణ్ చేసిన పొత్తు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి స్పందించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదన్నారు. ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఒప్పిస్తామని చెప్పారు కానీ మరేమీ అనలేదని పవన్ వ్యాఖ్యలను పురంద్రీశ్వరి సమర్థించారు. అధినాయకత్వం తమను పొత్తులపై అడిగితే తమ అభిప్రాయాలను కూడా చెబుతామని ఆమె తెలిపారు.
కేంద్ర పెద్దల నిర్ణయం మేరకే...
పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమేనని పురంద్రీశ్వరి తెలిపారు. జనసేన పార్టీ బీజేపీతో ఇప్పటికీ పొత్తుతో కలసి ఉందని ఆమె చెప్పారు. కేంద్రంలోని పెద్దలతో చర్చించిన తర్వాత తమ అభిప్రాయాలను చెబుతామన్న పురంద్రీశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తొలుత తప్పుపట్టింది బీజేపీ మాత్రమేనని గుర్తు చేశారు. సీఐడీ అనేది ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్న ఆమె చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అందరూ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారన్న విషయాన్ని గుర్తు చేశారు.