కడుపు మంటతోనే తప్పుడు ప్రచారం

పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. బాపట్లలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు.

Update: 2022-08-11 06:40 GMT

పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బాపట్లలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. మూడో విడత జగనన్న విద్యా దీవెన పథకం కింద 694 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద 11.02 లక్షల మంది విద్యార్థులు లబ్దిపొందుతున్నారన్నారు. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలను తెచ్చామన్నారు. కుటుంబంలో ఎంత మంది విద్యార్థులున్నా ప్రతి ఒక్కరికీ జగనన్న విద్యాదీవెన పథకం అందిస్తామని జగన్ ప్రకటించారు. ఫీజు ఎంతైనా సరే మొత్తం చెల్లిస్తున్నామని తెలిపారు.

నేరుగా తల్లుల ఖాతాల్లోకే...
నేరుగా తల్లుల ఖాతాల్లోనే ఈ విద్యా దీవెన మొత్తాన్ని జమ చేస్తున్నామని జగన్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మూడేళ్ల కాలంలోనే ఒక విద్యారంగం పైన 53 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యాకానుక, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, నాడు, నేడు మన బడి పథకం కింద ఈ నిధులను ఖర్చు చేశామని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఇంజీనర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లు రావాలని జగన్ ఆకాంక్షించారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఎన్ని కోట్లైనా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి వెనకాడదని చెప్పారు.
శ్రీలంకలా మారుతుందని...
పేదలకు పథకాల కింద ఉచితంగా డబ్బులు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లు తప్పుుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. గతంలో దోచుకునే వారు ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కడుపు మంటతో ప్రభుత్వంపై లేని పోని అభాండాలు వేస్తున్నారన్నారు. వారి మాదిరి మీడియా, దత్తపుత్రుడి మద్దతు లేకపోయినా తనకు ప్రజల దీవెన, దేవుడి దయ ఉందని జగన్ అన్నారు. జనం కోసం ఎంత వరకైనా తాను వెళతానని ఆయన తెలిపారు. బాపట్ల పట్టణంలో అడిషనల్ సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సంబంధించి 18 కోట్ల ను విడుదల చేస్తున్నానని తెలిపారు. బాపట్ల మున్సిపాలిటీలో పదిహేను కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానని చెప్పారు.


Tags:    

Similar News