కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్

కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించారు. శాంతిపురంలో ఏర్పాటు

Update: 2024-02-26 10:51 GMT

కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించారు. శాంతిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ భరత్ కు సీఎం జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడుతున్నాడని, కుప్పం ప్రజలు భరత్ ను ఆశీర్వదించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకుంటే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని తేల్చి చెప్పారు. భరత్ తో కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందిస్తానని తేల్చి చెప్పారు. పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా... లేక ఎన్నికలప్పుడు ప్రజలను వాడుకునే చంద్రబాబు మార్కు రాజకీయం కావాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి మంచి జరిగిందా? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి జరిగిందా? కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీటిని తీసుకువచ్చింది మీ జగన్. కుప్పంను మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పంనకు రెవిన్యూ డివిజన్ తీసుకువచ్చింది మీ జగన్. చిత్తూరు పాలడెయిరీని పునఃప్రారంభించింది మీ జగన్ అని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడేనా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాడు మంత్రిగా ఉంటూ చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని, కుప్పం వచ్చి 35 ఏళ్లుగా గెలుస్తూ కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని అన్నారు. ఇక్కడి ప్రజలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సొంత నియోజకవర్గం సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు.. 75 ఏళ్ల వయసులో నలుగురితో పొత్తు పెట్టుకుని వస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. పొత్తులు దేనికి అంటే సమాధానం చెప్పడని అన్నారు. చంద్రబాబుకు నాపై కోపం వస్తే కడపను, పులివెందులను తిడతాడు. ఆఖరికి రాయలసీమను కూడా తిడతాడు. కానీ నేను ఏనాడూ కుప్పంను పల్లెత్తు మాట అనలేదు. కుప్పం నియోజకవర్గాన్ని కానీ, ఇక్కడి ప్రజలను కూడా ఒక్క మాట అనలేదు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు.


Tags:    

Similar News