Ys Sharmila : పొన్నవోలుపై ఫైర్ అయిన వైఎస్ షర్మిల
జగన్ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
జగన్ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చార్జిషీట్ లో పెట్టించినందుకే పొన్నవోలుకి పదవి ఇచ్చారన్నారు. జగన్ పొన్నవోలుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్నారు. ఎవరో తెలియని సుధాకర్ రెడ్డికి ఆరు రోజుల్లో అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తారా ? అంటూ ప్రశ్నించారు. అంత హడావిడిగా సుధాకర్ రెడ్డికి ఎందుకు మేలు చేశారన్నారు. పొన్నవోలు అనే లాయర్ ఎవరో ప్రపంచానికి కూడా తెలియదని, జగన్ కోసం సుధాకర్ రెడ్డి పిటీషన్ లు వేశారు...చార్జీ షీట్ లో పేరు పెట్టించారని వైఎస్ షర్మిల మరోసారి ఆరోపించారు.
క్విడ్ ప్రోకో కాదా?
తండ్రి మీద కేసులు పెట్టిన వారికి ఎవరైనా పదవి ఇస్తారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ పదవి ఇచ్చారు అంటే మీరు పొన్నవోలు రుణం తీర్చుకోవాలి అనుకున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇది క్విడ్ ప్రొకో కాదా అని అన్నారు. సీబీఐ నిజానికి ఎఫ్ఐఆర్ లో కూడా వైఎస్సార్ పేరును చేర్చలేదన్నారు. వైఎస్సా్ పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్ బయటకు రావడం అసాధ్యం అనుకున్నారని, అందుకే వైఎస్ పేరును సీబీఐలో చేర్చాలని నిర్ణయించారని షర్మిల అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ కోర్టులో పొన్నవోలు పిటీషన్ లు వేశారన్నారు. జగన్ ఆదేశాల మేరకే సుధాకర్ రెడ్డి పిటీషన్ లు వేశారని ఆమె ఆరోపించారు.