సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు

Update: 2023-09-28 13:15 GMT

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు అయి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు తరపున పడిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు పిటీషన్ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుపై నమోదైన కేసులో తమ వాదనలు కూడా వినాలని అందులో కోరింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని.. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని అంటోంది. నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించి ఎన్ క్యాష్ చేసుకున్నారని.. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదనను కూడా మీ ముందు ఉంచడానికి అనుమతివ్వాలని సుప్రీం కోర్టును కోరింది ఏపీ ప్రభుత్వం.


Tags:    

Similar News