ఏపీ సర్కార్ పై హైకోర్టు సీరియస్.. విద్యార్థులకు సీట్లు ఇవ్వకపోతే జైల్లో ఉంటారని వార్నింగ్ ?

ఏపీలో విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం..

Update: 2022-09-02 10:23 GMT

ఏపీ ప్రభుత్వంపై హై కోర్టు మరోసారి సీరియస్ అయింది. పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో సీట్లు కేటాయించకపోతే.. మీరు జైల్లో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పేద పిల్లలకు విద్యను అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించడంలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది. ఓ వైపు విద్యాహక్కు చట్టం ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలని చెప్తున్నా.. ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ తో పాటు విద్యాశాఖ అధికారులకు హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఏపీలో విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు గతంలోనే విచారించింది. నేడు దానిపై హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. విద్యాహక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా.. కోర్టు వ్యాఖ్యల అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. పేద పిల్లలకు సీట్లను భర్తీ చేశామని, అందుకు సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించేందుకు కొద్దిగా సమయం కావాలని కోరారు. దాంతో కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం ఇచ్చే వివరాలపై ధర్మాసనం సంతృప్తి చెందనిపక్షంలో.. వ్యక్తిగత విచారణకు ఆదేశిస్తామని హైకోర్టు తెలిపింది.


Tags:    

Similar News