పవన్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
ఇటీవల రాష్ట్రంలో వేల సంఖ్యలో మహిళలు, యువతులు కనిపించకుండా పోయారని చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల రాష్ట్రంలో వేల సంఖ్యలో మహిళలు, యువతులు కనిపించకుండా పోయారని చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందించింది. దేని ఆధారంగా పవన్ మహిళల అదృశ్యంపై వ్యాఖ్యలు చేశారో 10 రోజుల్లోగా సమాధానమివ్వాలని నోటీసుల్లో పేర్కొంది. సమాధానం ఇవ్వని నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.
పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇవ్వడంపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పినట్లు పవన్ కల్యాణ్ అంటున్నారని, దాని గురించి ఏపీ ప్రజలకు తెలియాల్సిన అవసరం, బాధ్యత ఉన్నాయన్నారు. మహిళల అదృశ్యాలపై పవన్ చెప్పిన లెక్కలకు 10 రోజుల్లో ఆధారాలతో సహా వివరణ ఇవ్వకపోతే.. మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా కమిషన్ ఆయన్ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. మహిళా వాలంటీర్లకు, ఒంటరి మహిళలకు మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందన్నారు.