ఆ విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన సెల్వమణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా చర్చించుకునే నియోజకవర్గాల్లో

Update: 2024-03-04 03:58 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా చర్చించుకునే నియోజకవర్గాల్లో 'నగరి' ఒకటి. ఎందుకంటే అక్కడ ఏపీ మంత్రి, సినీ నటి రోజా సెల్వమణి పోటీ చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేకులపై కౌంటర్లు వేయడంలో రోజాను మించిన వారు లేరు. ఇక పర్యాటక మంత్రిగా ఎంతో బిజీ బిజీగా ఉండే రోజా.. సొంత నియోజకవర్గంలో జరిగే వర్గ పోరుపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే పలువురు నాయకులు ఆమెకు వ్యతిరేకంగా హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. ఎంతో మంది సొంత పార్టీ నాయకులు కూడా బహిరంగంగా రోజాపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు రోజాకు ఎంతో ఆప్తులుగా ఉన్న వ్యక్తులు.. ఇప్పుడు ఆమెకు టికెట్ ఇవ్వకూడదని ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

తాజా పరిణామాలపై రోజా భర్త సెల్వమణి స్పందించారు. ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన వారికి ఏ రోజు మేం ద్రోహం చేయలేదని వ్యాఖ్యలు చేశారు. మనల్ని విమర్శించారని వారిని తిరిగి మనం విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. దేవుడనే వాడు ఒకడు ఉంటాడు.. ప్రతి ఒక్కటి చూస్తుంటాడని అన్నారు. రోజా ఎమ్మెల్యేగా గెలవదన్నారు, మంత్రి పదవి రాదన్నారు. కానీ, అవి జరిగాయన్నారు. ఈ సారి 175 స్థానాల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని.. అందులో ఫస్ట్ గెలుచేది నగరి నియోజకవర్గమేనని అన్నారు. గెలిచిన తర్వాత మమ్మల్ని వ్యతిరేకించేవారితో మాట్లాడుతామన్నారు. ఈ సమావేశంలో కొందరు నాయకుల పేర్లు కూడా సెల్వమణి ప్రస్తావించారు. నిండ్ర చక్రపాణి రెడ్డికి శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇవ్వాలని రోజా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ను కోరారని.. ఆ తర్వాతే ఆయనకు పదవి వచ్చిందన్నారు. జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డికి స్థానికులు వద్దని చెప్పినా పదవి ఇచ్చామని అన్నారు. కేజీ కూమార్ కుటుంబానికి ఎంతో సహాయం చేశామన్నారు. తమతో ఉన్న వాళ్లకు కావాల్సినవి చేశామని తెలిపారు.


Tags:    

Similar News