ప్రాణం ఉన్నంతవరకూ జగనన్న వెంటే నడుస్తా : మంత్రి రోజా
జగనన్న అండదండలతో, భగవంతుడి ఆశీస్సులతో, నగరి ప్రజల ప్రేమాభిమానాలతో నన్ను మంత్రిగా..
తిరుపతి : ఏపీ కొత్త కేబినెట్ లో ఆర్కే రోజా పర్యాటకశాఖ మంత్రిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ''జగనన్న అండదండలతో, భగవంతుడి ఆశీస్సులతో, నగరి ప్రజల ప్రేమాభిమానాలతో నన్ను మంత్రిగా నియమించడం నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని జగనన్న నాకు ఇచ్చారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగనన్న వెంటే నడుస్తాను. ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మహిళల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తాను'' అని మంత్రి రోజా తెలిపారు. తనకు మంత్రి పదవి రావాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తాను నటించిన భైరవదద్వీపం సినిమా ఇటీవలే 28 ఏళ్లు పూర్తి చేసుకుందని రోజా గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా వచ్చి 28 ఏళ్లైందంటే నమ్మలేకపోతున్నానని, నిన్న మొన్నేసినిమాలో నటించినట్లు ఉందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఫస్ట్ షాట్‌ను ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారని వివరించారు.