జూదం పోటీలు పెడితే.. ఏపీకే ఫస్ట్ ప్రైజ్: టీడీపీ నేత
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జూద
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జూద రహితంగా చేశామని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఒక వేళ ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిచేస్తే.. ఏపీనే మొదటి స్థానంలో నిలుస్తుందంటూ ఎద్దేవా చేశారు. జూదం పోటీలు నిర్వహిస్తే.. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీనే ఛాంపియన్ నిలిచే అవకాశం ఉందంటూ సెటైర్ వేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు.. రాష్ట్రంలో అనధికారికంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇష్టా రాజ్యంగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
చిలకలూరి పేకాటకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. చిలుకలూరిపేటలోని అపార్ట్‌మెంట్లలో విచ్చలవిడిగా జూదం నడుస్తోందని అన్నారు. యావరేజ్‌గా రోజుకు 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. పేకాట క్లబ్‌ల్లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారని పుల్లారావు ఆరోపించారు. సీఎం జగన్‌కు కంటి చూపు మేరలో చిలకలూరిపేట ఉందని, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు కనబడట్లేదా? అని ప్రశ్నించారు. సీనియర్ సిటిజన్స్ ఆడుకునే క్లబ్‌లు మూసేసి.. అనధికారికంగా పేకాట క్లబ్‌లు తెరిచారని అన్నారు. పేకాట క్లబ్‌ల వల్ల పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు.
మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్, మంత్రి విడదల రజని పుణ్యాన సూసైడ్లు చేసుకుంటున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. విడదల రజని మహిళా మంత్రిగా ఉండి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతకుముందు నాలుగేళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మద్దతు ధర లేక రైతులు లబో దిబో మంటున్నారని, రైతులను జగన్ సర్కార్ నిండా ముంచిందన్నారు.