చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఏపీ రాజకీయాల్లో రచ్చ

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో..

Update: 2023-09-03 16:09 GMT

ఏపీలో అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ప్రతిరోజు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. రెండు పార్టీల నేతల మధ్య ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ నోటీసుల వ్యవహారం మరో రచ్చకు తెరలేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా 118 కోట్ల వరకు చేతులు మారాయన్న ఆరోపణలతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కిపోతోంది. 2020-21లో వెల్లడించని 118 కోట్ల రూపాయల పూర్తి లెక్కలు చూపాలని, 153-సి సెక్షన్ ప్రకారం ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.

ఇదే అంశంపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు రాష్ట్రాన్ని దారుణఃగా దోచేసుకున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ హాయంలో ఏపీ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకున్నారని చంద్రబాబుపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఐటీ నోటీసులు వచ్చాయంటే అవినీతికి పాల్పడినట్లేనని, చట్టం నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరని టీటీడీ మాజీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి అన్నారు.

ఇక ఏ నోటీసు ఇచ్చినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకు ప్రతిసారీ అలవాటుగా మారిపోయిందని వైసీపీ మంత్రులు చురకలంటిస్తున్నారు. చంద్రబాబు చెప్పేవన్ని అబద్దాలేనని, ఆయన హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులలో ఎన్ని కోట్లు దోచేశారనేది స్పష్టంగా ఉందంటున్నారు. నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు ప్రతి రోజు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం తప్ప చేసిందేమి లేదని, రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిందేమి లేదన్నారు.

Tags:    

Similar News