Ys Jagan : లైన్ దాటిన నేతలపై జగన్ కఠిన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలు అనేక మంది అధికార పార్టీలోకి వెళ్లిపోయారు

Update: 2024-10-06 08:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలు అనేక మంది అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రధానంగా కూటమి పార్టీల్లోకి స్థానం వెతుక్కుని వారంతా ఈ ఐదేళ్లు తలదాచుకుందామన్న ప్రయత్నంలో ఉన్నారా? లేక నిజంగానే వైసీపీకి ఇక భవిష్యత్ లేదని భావించి టీడీపీ వైపు వెళ్లారా? అన్నది తెలియక పోయినా.. స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం తమ పదవిని కాపాడుకోవడానికే జంప్ చేసినట్లు సులువుగానే అర్థమవుతుంది. ఇక ముఖ్య నేతలు కొందరు కూటమి పార్టీలోకి జంప్ కావడానికి అనేక కారణాలున్నాయి. జగన్ తమను పట్టించుకోలేదని, అపాయింట్‌మెంట్ కూడా దొరకదన్న విమర్శలు చేశారు.

అందుకే వెళ్లారా?
ప్రధానంగా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఉదయభాన, వంటి వారు ఉన్నారు. ఎన్నికల తర్వాత ఫలితాలను చూసి వీరు పార్టీని మారారు. అయితే కాపు సామాజికవర్గం మద్దతు తమకు దొరకదన్న భయంతోనే వీరు వెళ్లారన్న ప్రచారం పెద్దయెత్తున జరిగింది. ఒంగోలు పట్టణ నియోజకవర్గంలో బాలినేని వాసు గెలవాలంటే ఖచ్చితంగా కాపులు సహకరించాల్సిందే. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయభాను గెలవాలంటే కాపులతో పాటు కమ్మ సామాజికవర్గం మద్దతు కూడా అవసరం. ఎందుకంటే టీడీపీతో జనసేన పొత్తు ఎటూ ఉంటుంది కాబట్టి తమ గెలుపు ఖాయమని నమ్ముతున్నారు.
అక్కడ చోటు దొరుకుతుందని...
ఇక కిలారు రోశయ్యకు పొన్నూరు స్థానం దక్కే అవకాశం లేదు. జనసేన నుంచి మరో స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టవచ్చన్న అంచనాతో ఆయన గాజుగ్లాసు గుర్తుకు జై కొట్టారు. అయితే ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దొరకడమే కష‌్టమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే అక్కడ పోటీ బలంగా ఉంది. నేతల సంఖ్య కూడా ఎక్కువే. ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు ఎక్కువ మంది బరిలో ఉండేందుకే ప్రయత్నాలు చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీ అధినాయకత్వం కూడా తొలి నుంచి పార్టీని నమ్ముకున్న నేతలకే ప్రయారిటీ ఇస్తుందన్న కామెంట్స్ కూడా ఇప్పుడు వారిని కలవరానికి గురి చేస్తున్నాయి.
లైన్ దాటిన నేతలను...
కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఒకసారి లైన్ దాటిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తనను కలసిన నేతలతో చెెప్పారు. ఒకసారి పార్టీ జెండాను కాదని వెళ్లిపోయిన వారికి ఇక ఎంట్రీ అనేది ఉండదని జగన్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకే వెళ్లేవారిని ఎవరినీ బతిమాలలేదు. కనీసం బుజ్జగింపులు కూడా చేయలేదు. వెళ్లేవాళ్లు వెళ్లవచ్చన్న బలమైన సంకేతాలను పంపారు. కాలు కదిపితే ఇక అంతేనని అన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. వైఎస్ జగన్ నిర్ణయంతో వైసీపీ తాడేపల్లి కార్యాలయం గేట్లు ఒకసారి పార్టీని వీడిన వారికి మూసుకుపోయినట్లే. మరి నేతలు గీత దాటి వెళ్లరనే జగన్ ఇలా అన్నారా? అన్నది కూడా అనుమానమే.


Tags:    

Similar News