Tungabhadra : దరిద్రంలో దురదృష్టం అంటే ఇదేనేమో... అప్పుడే తుంగభద్ర గేట్లు మరమ్మతులు చేయగలిగేది
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు పెద్దకష్టమే వచ్చిపడింది. లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది.
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు పెద్దకష్టమే వచ్చిపడింది. లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే కర్ణాటక రైతులకు ఈ సీజన్ కు నీళ్లు ఇవ్వలేమని చెప్పేశారు. ఎందుకంటే తుంగభద్ర గేట్లను మరమ్మతులు చేయాలంటే రోజుకు తొమ్మిది టీఎంసీల చొప్పున అరవై టీఎంసీల నీటిని దిగువకు వదిలి డ్యామ్ ను ఖాళీ చేస్తేనే రిపేర్లు చేయగలుగుతారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఇప్పటికే లక్ష క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.
వరద నీరు వచ్చి...
తుంగభద్ర గేటు మరమ్మతులు పూర్తయ్యే వరకు వరద నీరు సుంకేశుల ప్రాజెక్టుకు వచ్చి చేరుతూనే ఉంటుంది. అందుకే ప్రాజెక్టు కింద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అధికారులు అంటున్నారు. తుంగభద్ర గేటు పై భారం పడకుండా ఏడు గేట్లు ఎత్తి ప్రస్తుతం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఎనిమిది గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది. అసలే పంటలకు నీరు లేదని, ఈ ఏడాది మంచి వర్షాలు కురిశాయని ఆనందపడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతులకు తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకు పోవడం పెద్ద దెబ్బేతగిలింది.
సుంకేశుల ప్రాజెక్టుకు...
తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఏపీ వాటా 35 శాతం ఇవ్వాల్సి ఉంది. గేటు కొట్టుకుపోయిన ఘటనపై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు తాగు, సాగు నీరు అందుతుంది. ఇప్పుడు నీరంతా వృధాగా పోతుండటంతో దరిద్రం ఇలా తమను తరిమికొడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం త్వరలోనే గేట్లను మరమ్మతులు చేస్తామని చెబుతున్నారు. అప్పటి వరకూ నీరంతా వృధాగా పోవాల్సిందే. సుంకేశుల ప్రాజెక్టు కింద ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.