Assembly : సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగుల పెట్టించాం.. అభివృద్ధి పథాన నడిపించాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకూ నాలుగు బడ్జెట్‌లను ప్రవేశ పెట్టిందన్నారు. విజయవాడలో 206 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని చెప్పారు. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనేక రంగాల ప్రజలు లబ్ది పొందారన్నారు. ప్రధానంగా రైతులు, మహిళలు, యువత, వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యపై ప్రత్యేంకగా దృష్టి పెట్టామన్నారు.
విద్యారంగంలో...
పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ ను అందస్తున్నామని గవర్నర్ తెలిపారు. నాడు - నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా భవనాలను మరమ్మతులు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలను విద్యారంగంలో తీసుకువచ్చామని చెప్పారు. ప్రతి రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. పుస్తకాలు, యూనిఫాంలు అందించి కార్పొరేట్ స్కూల్ పిల్లలకు ధీటుగా వారు కనిపించేలా, ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పిల్లలకు ట్యాబ్ లు అందించి బైజూస్ సంస్థ ద్వారా విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
వైద్యరంగంలో...
విద్యా రంగంతో పాటు వైద్య రంగంలో కూడా సంస్కరణలను తీసుకు వచ్చామని గవర్నర్ తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పలాసలో క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలను చేశామని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పధకాన్ని ఐదు లక్షల ఆదాయ పరిమితి నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకూ పెంచామని గవర్నర్ చెప్పారు. 2019 నుంచి ఆరోగ్య శ్రీ పధకం కింద 36 లక్షల మంది లబ్ది పొందారన్నారు.
రైతాంగాన్ని ఆదుకునేందుకు ...
రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. ఉచిత పంటల బీమా పధకాన్ని రైతులకు వర్తింప చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 13,500 అందిస్తున్నామని చెప్పారు. 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గవర్నర్ వివరించారు. 53.53 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని, 22. 25 లక్షల మంది రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించామని గవర్నర్ తెలిపారు. రైతులు రాష్ట్రానికి వెన్నుమక అని తమ ప్రభుత్వం భావించి వారిని అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు. వైఎస్సార్ కాపు నేస్తం కింద 2,029 కోట్లను లబ్దిదారులకు పంపిణీ చేశామని చెప్పారు.
టీడీపీ వాకౌట్...
టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం ప్రారంభమయిన కొద్దిసేపటికి వాకౌట్ చేశారు. గవర్నర్ బయటకు వెళ్లే దారిలో బైఠాయించారు. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. మార్షల్స్‌కు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వారితో వాగ్వాదానికి దిగారు. అయితే గవర్నర్ వెళుతున్నసమయంలో ఇక్కడ ఎలాంటి నిరసనకు అనుమతి లేదని మార్షల్ చెప్పారు. వారిని అక్కడి నుంచి బయటకు పంపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు.