రాళ్లతో పవన్ కళ్యాణ్ పై దాడికి యత్నం
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వెళుతున్నారు. రాజోలులో తనపై కొంతమంది దాడికి ప్రయత్నించారని
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వెళుతున్నారు. రాజోలులో తనపై కొంతమంది దాడికి ప్రయత్నించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. కోనసీమలో వారాహి యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై దాడి చేసేందుకు రాళ్లు పట్టుకొని నలుగురు తిరిగారన్నారు. తనపై దాడికి ప్రయత్నించిన వారిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనపై ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని.. తన ద్వారా ప్రజల్లో మార్పు వస్తోందని అధికారంలో ఉన్నవాళ్లు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. తన కోసం సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయని మరో సారి అన్నారు.
పి గన్నవరం నియోజకవర్గ పార్టీ నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ పాలన నుండి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తి చేయాలన్నారు. రాజోలులో నాయకుడు వెళ్లిపోయినా పార్టీ శ్రేణులు అండగా నిలబడ్డాయని అన్నారు. ఇక్కడి వారు ఇచ్చిన ప్రేరణతోనే వారాహి యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు.చీకట్లో ఉన్న జనసేన పార్టీని.. 2019 ఎన్నికల్లో రాజోలులో గెలిపించి చిరు దీపం వెలిగించారని అన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మనతో ఉండి ఉంటే.. ఆయనను భుజాలపై పెట్టుకునేవాడినని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలపై తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలు తన పర్యవేక్షణలోనే ఉంటాయని వెల్లడించారు. గోదావరి జిల్లాలు బాగుంటేనే రాష్ట్రమంతా బాగుంటుందని చెప్పుకొచ్చారు.
అన్న పార్టీ కంటే తన పార్టీ నేతలే గొప్పని పరోక్షంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీ నాయకులకు కమిట్మెంట్ లేదని.. ఇప్పుడు జనసేన నాయకులకు ఉన్న కమిట్మెంట్ అప్పుడు ఉండి ఉంటే..పార్టీని విలీనం చేయాల్సి వచ్చేది కాదన్నారు. 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో తనకు 18 శాతం ఓట్లు పడ్డాయని అంటే 20 లక్షలమంది ఓట్లేశారని గుర్తు చేశారు. ఈసారి తప్పకుండా భారీగా సీట్లను సాధిద్దామని చెప్పారు.