అయేషా కేసు - తనకు పరిహారం చెల్లించాల్సిందేనంటున్న సత్యంబాబు

2007 డిసెంబర్ 27న బీ ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్ లో దారుణ హత్యకు గురైంది. తన ప్రేమను..

Update: 2022-05-17 05:30 GMT

గుంటూరు : బీ.ఫార్మసీ విద్యార్ధిని అయేషా మీరా కేసులో నిర్ధోషిగా విడుదలైన తనకు పరిహారం చెల్లించాలని సత్యం బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును సత్యం బాబు సోమవారం నాడు కలిశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఢిల్లీ రావుకు వినతిపత్రం సమర్పించారు. రెండు ఎకరాల సాగు భూమితో పాటు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆ వినతి పత్రంలో కలెక్టర్ ను కోరారు. చేయని నేరానికి తాను 9 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించినట్టుగా సత్యం బాబు చెప్పారు. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని, ఆయేషా మీరా కేసులో తనను హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించినందున పరిహారం చెల్లించాలని కోరారు. తాను చేయని నేరానికి 9 ఏళ్లు జైలుశిక్ష అనుభవించానని.. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని సత్యంబాబు కోరారు. 2 ఎకరాల సాగు భూమి, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే న్యాయం చేస్తారని భావిస్తానన్నారు.

2007 డిసెంబర్ 27న బీ ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్ లో దారుణ హత్యకు గురైంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే హత్య చేసినట్టుగా ఓ లేఖ కూడా లభ్యమైంది. అత్యాచారం చేసి ఆయేషా మీరాను హత్య చేశారని గుర్తించారు. సెల్ ఫోన్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని నిందితుడిగా గుర్తించి 2008 ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నిందితులను రక్షించే ఉద్దేశ్యంలో భాగంగా సత్యం బాబును అరెస్ట్ చేశారంటూ అతడి బంధువులు, మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు. జైలులో ఉన్న సమయంలో సత్యం బాబుకు అనారోగ్యం కారణంగా పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సత్యంబాబును పోలీసులు ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని తేల్చి చెప్పింది. సత్యంబాబుకు కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను రద్దు చేసి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.




Tags:    

Similar News