వచ్చేసిన ప్రకటన.. కలిసి పోరాడబోతున్నారు

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి

Update: 2024-03-09 14:10 GMT

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేసిన చర్చలు ఎట్టకేలకు ఫలవంతం అయ్యాయి. జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని ఆ ప్రకటనలో తెలిపారు.

"బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. గత పదేళ్లుగా భారతదేశ పురోభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలతో భాగస్వామ్యం ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో దోహదపడుతుంది. బీజేపీ, టీడీపీ మధ్య చాలా పాత స్నేహం ఉంది. టీడీపీ 1996లో ఎన్డీయేలో చేరింది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలోనూ, నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనూ విజయవతంగా కలిసి పనిచేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ మద్దతు పలికింది. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం మార్గదర్శకాలు, ఇతర వివరాలపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుంది. మా కూటమి ఏపీ ప్రజల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రజలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం" అని ఉమ్మడి ప్రకటన వచ్చింది. బీజేపీ కేంద్ర కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది.


Tags:    

Similar News