గొడ్డలిపోటు కథ క్లైమాక్స్ కు !

ఏపీలో అంబేద్కర్ రాజ్యం కాకుండా జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని బీజేపీ నేత భాను ప్రకాశ్ అన్నారు.

Update: 2023-05-25 13:56 GMT

ఏపీలో అంబేద్కర్ రాజ్యం కాకుండా జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని బీజేపీ నేత భాను ప్రకాశ్ అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అవినాష్ రెడ్డి కేసు చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కూర్చోని ప్రజల సమస్యలపై ఒక్క రోజు మట్లాడని ఎమ్మెల్యేలు కర్నూలు ఆస్పత్రి ముందు కూర్చొని ధర్నా చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చి ఎవరిని రక్షించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. హత్య కేసులో కథ క్లైమాక్స్‌కు చేరిందన్నారు. హత్య వెనుక పాత్రధారులు, సూత్రధారులు ఎవరున్నా సీబీఐ వదలదన్నారు. గతంలో సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవారు.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐకి పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు. సీబీఐ దర్యాప్తును ఎవరూ అడ్డుకోలేరని భానుప్రకాశ్ అన్నారు.

రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను జగన్ కనుసన్నల్లోనే నడుస్తాయని, ఇండియన్ పోలీస్‌ సర్వీస్‌ను కాస్త ఏపీలో ఇండియన్ పొలిటికల్ సర్వీస్‌గా మార్చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ఐపీసీ సెక్షన్లు పనిచేయడంలేదని, వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదన్నారు.ఎమ్మెల్యేలు, అధికారులు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుందని ఆరోపించారు. వైసీపీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకతను గడప గడపకు వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వెళ్తే అడ్డుకుంటున్నారంటే ప్రజల పట్ల వ్యతిరేకత ఎలా ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ సీఎం కూడా పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లలేదని, కేవలం ఆ ఘనత సీఎం జగన్‌కే చెందుతుందని విమర్శించారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని భానుప్రకాష్ అన్నారు. హత్య కేసులో ఎంతటివారున్నా దర్యాప్తు తర్వాత సీబీఐ అరెస్ట్ చేస్తుందన్నారు.

Tags:    

Similar News