కేంద్ర హోంశాఖకు జీవీఎల్ లేఖ... ప్రత్యేక హోదాపై మరో కమిటీని?
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించడంపై స్టేట్ మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాలని జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో కోరారు. త్రిసభ్య కమిటీ సమావేశం అజెండాలో తొలగించిన అంశాలను కొత్త కమిటీలో చర్చించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అసమర్థ ప్రభుత్వం....
దీంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ప్రచార ఆర్భాటం, స్టిక్కర్లు వేసుకోవడం తప్ప అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు కింద 200 గ్రామాలకు తాగునీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలను సద్వినియోగం చేసుకునే కనీస ప్రయత్నం చేయడం లేదన్నారు.
వేల కోట్ల రూపాయలు....
కాకినాడ పెట్రో కెమికల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కొరవడిందన్నారు. గ్రాంట్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాయన్నారు. ఈ విషయంలో కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందిపోయి విమర్శలు చేేయడమేంటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఏడేళ్లో 35 వేల కోట్లతో జాతీయ రహదారులను కేంద్రం అభివృద్ధి చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ ఎంపీలు తమ నియోజకవర్గంలో సమస్యలపై ముఖ్యమంత్రితో ఏనాడైనా చర్చించారా? అని నిలదీశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థిితిని చూస్తుంటే పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ రాజకీయ అంశాలను తెరమీదకు తెస్తుందన్నారు.