అవనిగడ్డ కరకట్టపై పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
కాలువలో కారు 90 శాతం మునిగిపోగా.. కారులో ఉన్న వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. పెనమలూరు చోడవరం వద్ద..
కృష్ణాజిల్లా అవనిగడ్డ కరకట్టపై సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. కరకట్టపై వెళ్తుండగా ఓ కారు అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో కారు 90 శాతం మునిగిపోగా.. కారులో ఉన్న వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. పెనమలూరు చోడవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వ్యక్తి అవనిగడ్డకు చెందిన ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ రత్నభాస్కర్ గా గుర్తించారు పోలీసులు. అతని ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. కారులో రత్నభాస్కర్ ఒక్కరే ఉన్నారా ? ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. కాగా.. కారు అతివేగంతో దూసుకు రావడంతో ప్రమాదం జరిగిందా ? లేక పట్టు కోల్పోవడంతో అదుపుతప్పి కాలువలో పడిందా ? అని పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై రత్నభాస్కర్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో విజయవాడ కొత్తపేటకు చెందిన మానేపల్లి సుధారాణి (33) అనే మహిళ మరణించింది. విజయవాడ నుంచి మచిలీపట్నం బైక్ పై భర్తతో కలిసి వస్తుండగా ప్రొద్దుటూరులో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పడంతో ఆమె కిందపడ్డారు. గాయాలపాలైన సుధారాణిని ఉయ్యూరు ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మరణించింది. ఈ ఘటనపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.