ఏపీలో జిల్లా ఎస్పీలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం.. బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు అందాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఛీఫ్ సెక్రటరీ, డీజీపికి రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా పంపారు. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఎన్నికల విధుల నుంచి...
చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ పై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. మరోవైపు గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్ ను కూడా విధుల నుంచి తప్పించింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్త మునియ్య హత్య విషయంలో ప్రకాశం ఎస్పీ సక్రమంగా వ్యవహరించలేదని వేటు వేశారు. ప్రధాన మంత్రి సభలో సెక్యూరిటీ లోపాల పై గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పై చర్యలు తీసుకున్నారు. వీరందరినీ తమ కింద అధికారులకు బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.