విశాఖపట్నం విషయంలో వదంతులను నమ్మొద్దంటున్న కేంద్ర మంత్రి

కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. కొందరు పని కట్టుకుని

Update: 2022-09-28 14:05 GMT

విశాఖ రైల్వే జోన్‌ పై జరుగుతోన్న ప్రచారాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందించారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తెలిపినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. అలాంటి వార్తలను నమ్మొద్దని.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదన్నవి కేవలం పుకార్లేనని చెప్పుకొచ్చారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పేసిందంటూ వార్తలు వచ్చాయి. విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రైల్వే జోన్, విభజన సమస్యలు సహా మొత్తం 14 అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పారని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. అశ్విని వైష్ణవ్‌ మాత్రం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుందని... రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని అన్నారు.


Tags:    

Similar News