పోలవరం తొలిదశ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ ఎల్ కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు..
పోలవరం తొలిదశ నిధుల విడుదల విషయంలో కేంద్రం శుభవార్త చెప్పింది. సీఎం జగన్ కృషి, శ్రమ ఫలించాయి. ఎట్టకేలకు ప్రాజెక్టుకు నిధుల విడుదలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించేందుకు కూడా కేంద్రం అంగీకరించింది.
2013-14 ధరలతో కాకుండా తాజా ధరల ఆధారంగా నిధులు చెల్లించేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ ఎల్ కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆమెదించినట్టు లేఖలో స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇప్పటి వరకూ అనేకమార్లు పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఢిల్లీకి వెళ్లారు. రూ.10 వేల కోట్ల అడ్ హక్ నిధులిచ్చి ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మోదీ.. నిధులు విడుదల చేయాలని జలశక్తిశాఖకు ఆదేశాలు జారీ చేశారు.
2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు కాగా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33,168.23 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంచనా వ్యయం సరిపోదని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. తాజాగా పోలవరం నిధుల విడుదలపై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.