Chandrababu : అధికారం అయితే వచ్చింది కానీ.. ఆనందం మాత్రం లేకపోయె

అధికారంలోకి వచ్చామన్న ఆనందం కంటే ఇచ్చిన హామీలను అమలు చేయడంపై చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారింది

Update: 2024-07-16 11:50 GMT

వైఎస్ జగన్ ను అధికారంలోకి దించాలనుకున్నారు. దించేశారు. ఇందుకోసం ఏడు పదుల వయసులో ఆయన పడిన కష్టాన్ని ఎవరూ కాదనలేరు. జైల్లోకి వెళ్లారు. అయినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి పార్టీని తిరిగి నిలబెట్టేందుకు ఆయన చేపట్టిన ప్రతి చర్య అభినందనీయమే. ఏమాత్రం నిరాశ పడలేదు. నేతలు ఒకింత దూరంగా ఉన్నా.. క్యాడర్ వద్దకు తానే వెళ్లి వారిని యాక్టివ్ చేయగలిగారు. ఇక కూటమిగా ఏర్పాటు కావడంతో ఆయన చూపించిన సహనాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. అన్నీ భరిస్తూ... విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. గతంలో ఎన్నడూ రానంత విజయం దక్కింది. ఎంతగా అంటే ప్రజల మూడ్ ను చూస్తుంటే టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచేదన్న లెక్కలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఖజానా ఖాళీ....
సరే... అదలా ఉంచితే.. ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా చంద్రబాబు లో ఆనందం కనిపించడం లేదు. ఖజానా ఖాళీ అయింది. ఈసారి ఆయన రెండు పనులు పూర్తి చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను చేపట్టి తీరాలి. ఎందుకంటే ఈ రెండు ఆయన తన కలలు ప్రాజెక్టులుగా పదే పదే చెబుతూ వచ్చారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టును 70 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని ఆయన అంటున్నారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో రెండు శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారంటున్నారు. కానీ తీరా చూస్తే పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పనులు పూర్తి కావాలంటే అధికారులు నాలుగు సీజన్లు కావాలని చెబుతున్నారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మరీ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి.
కోట్ల రూపాయల నిధులు...
ిఇక అమరావతి నిర్మాణం కూడా అంత సులువు కాదు. ఎందుకంటే భవనాలు అయితే నిర్మించవచ్చు కానీ.. దానికి రాజధానికి కావాల్సిన హంగులన్నీ తీర్చిదిద్దాలంటే వేల కోట్లు అవసరమవుతాయి. ఇవన్నీ కావాలంటే కేంద్రం సహకారం అవసరం. అది ఎంత వరకూ సాధ్యమవుతుందో చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఉన్నది మోదీ. ఉత్తర భారత రాష్ట్రాలను కాదని, ఏకపక్షంగా ఏపీకి నిధులు కుమ్మరిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. టీడీపీ మద్దతు పై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ చంద్రబాబు డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే మరోసారి మోదీతో కయ్యానికి దిగే సాహసాన్ని ఆయన చేయకపోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలకే అయినా వరసగా ఇలా కూటమిలో చేరడం, వెళ్లడం పై ప్రజల్లోనూ ఒకరకమైన వ్యతిరేకత ఎదురవుతుందన్న భావన ఆయనలో సహజంగా ఉంటుంది.
కేంద్రంవైపు చూడాల్సిందే...
అందుకే చంద్రబాబు ఇప్పటికిప్పుడు సంపదను సృష్టించే మార్గాలు లేవు. ఇచ్చిన హామీలు కూడా అమలు పర్చాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు పర్చాలంటే లక్ష కోట్ల రూపాయలకు పైగానే నిధులు అవసరమవుతాయి. అలాగని అధికారంలోకి రాగానే పన్నుల భారాన్ని ప్రజలపై మోపలేని పరిస్థితి. అందుకే ఢిల్లీ వైపు చూడటం తప్ప ఇప్పుడు చంద్రబాబు వద్ద మరో ఆప్షన్ లేకుండా పోయింది. కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి నిధులు తెచ్చుకోగలిగితేనే కొంత వరకూ ఈ సమస్యల నుంచి ఆయన బయటపడతారు. అధికారంలోకి వచ్చి నెల మాత్రమే కావడంతో ఇప్పుడిప్పుడే పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోరు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ హామీలు అమలు చేయాలన్న వత్తిడిని చంద్రబాబు విపక్షాలు, జనం నుంచి ఎదుర్కొనక తప్పదు. అందుకే చంద్రబాబుకు ఈ ఏడాది మాత్రం పాలన కత్తిమీద సామే అవుతుందని మాత్రం చెప్పక తప్పదు.


Tags:    

Similar News