Chandrababu : గుడ్ న్యూస్ చెప్పేందుకు చంద్రబాబు సిద్ధం... ఈ నెల 12న ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కావస్తుంది. అయితే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని విపక్ష వైసీపీ విమర్శలు చేస్తుంది. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయినట్లు తెలిసింది. మహిళలు నొచ్చుకోకుండా ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసి వచ్చారు.
సమీక్షలో...
ఈ నెల 12వ తేదీన రవాణా శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఉచిత బస్సు ప్రయాణంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెండు నెలలయినా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయినా అమలు చేయకపోతే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఎదురవుతుందని పాలకవర్గం భావిస్తుంది. అందుకే ముందుగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని వీలయినంత త్వరగా అమలు చేసి మహిళళకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చంద్రబాబు సిద్ధమయ్యారని తెలిసింది. సమీక్ష అనంతరం ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు ఒక ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది.
మిగిలన పథకాలు...
ఏడాదికి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 250 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే లెక్కలు వేశారు. ఇది పెద్దమొత్తం కాదని, మిగిలిన పథకాలు అమలు చేయకపోయినా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే రవాణాశాఖ మంత్రి దఫాలుగా అధికారులతో చర్చలు జరిపి దీనిపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. ఆర్డినరీ, సిటీ, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అవకాశాలున్నాయి. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించే అవకాశముంది.