నేను కూడా వారి కాళ్లకు దండం పెడతా: నారా చంద్రబాబు

ఒకప్పుడు రాజకీయనాయకులు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి ఏపీ రాజకీయాల్లో చాలా తక్కువ

Update: 2024-07-13 08:37 GMT

ఒకప్పుడు రాజకీయనాయకులు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి ఏపీ రాజకీయాల్లో చాలా తక్కువ. కానీ ఇటీవలి కాలంలో మాత్రం అది మరీ ఎక్కువైంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కాళ్లకు నమస్కారం చేసే వారి సంఖ్య విపరీతంగా ఎక్కువైపోయింది. అయితే ఈ విషయంపై తాజాగా ఏపీ సీఎం కీలక సూచన చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని, ఆ పద్దతి సరికాదన్నారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండంపెడితే, తాను వారి కాళ్లకు దండం పెడతానన్నారు. నేటి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు చంద్రబాబు సూచించారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలని.. కానీ రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దన్నారు చంద్రబాబు. రాజకీయ నేతల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్లారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. తిరుమల వెంకన్న తనకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News