అమలాపురం ఘటన పోలీసుల వైఫల్యమే: చంద్రబాబు నాయుడు

కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారు. యువత, జేఏసీ నేతలు పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. మంగళవారం నాడు అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు.

Update: 2022-05-25 02:02 GMT

అమలాపురం పట్టణంలో మంగళవారం నాడు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! తూర్పుగోదావరి జిల్లాను విభజించి కోనసీమ జిల్లా పేరు మార్చడంతో ఆందోళన తీవ్రమైంది. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారు. యువత, జేఏసీ నేతలు పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. మంగళవారం నాడు అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. అమలాపురం పట్టణంలోకి జేఏసీ నేతలు, జిల్లా సాధన సమితి నాయకులు, యువకులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. యువకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరు యువకులు ఓ ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీ, గన్ మెన్లతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అటు పోలీసు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ప్రస్తుతం అమలాపురంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమని అన్నారు. కోనసీమలో హింసకు తమ పార్టీని నిందించిన తీరును టీడీపీ అధినేత ఖండించారు. సమస్యాత్మక ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు.


Tags:    

Similar News