నన్ను బెదిరించడం.. మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు రణరంగంగా మారింది. టీడీపీ అధినేత;
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు రణరంగంగా మారింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కురబలకోటలో చంద్రబాబు మీటింగ్ ఉండగా.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లదాడులకు దిగాయి. ఉద్రిక్త పరిస్థితులతో అంగళ్లు రణరంగంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసన, రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఒకానొక దశలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. . వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు చికిత్స చేయించాలని టీడీపీ నేతలకు సూచించారు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా? అంటూ ప్రశ్నించారు. తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానన్నారు. టీడీపీ కార్యాకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు. తాను బాంబులకే భయపడలేదని.. రాళ్లకు భయపడతానా? అని అన్నారు. నన్ను బెదిరించడం.. మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదని చంద్రబాబు నాయుడు అన్నారు.