నేడు సీఐడీ కస్టడీకి చంద్రబాబు నాయుడు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం పెట్టుకున్న క్వాష్ పిటిషన్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం పెట్టుకున్న క్వాష్ పిటిషన్ కొట్టివేయగా, చంద్రబాబు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన్ను నేడు, రేపు ఏపీ సీఐడీ విచారించనుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. చంద్రబాబును విచారించటం ద్వారా స్కామ్ లోని మరిన్ని విషయాలను బయటికి తీసుకురావాలని సీఐడీ భావిస్తోంది.
శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రశ్నిస్తారు. మధ్యలో ఓ గంట భోజనం కోసం విరామం ఇస్తారు. విచారణ జరిగే సమయంలో అటు చంద్రబాబు, ఇటు సీఐడీ తరపున న్యాయవాది ఉంటారు. డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ ప్రక్రియ జరుగుతుందని సీఐడీ వర్గాలు చెప్పాయి. గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి తన తరపున న్యాయవాదిని సంప్రదించుకునేందుకు చంద్రబాబుకు అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని కోర్టు, సీఐడీకి సూచించింది. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓ గదిని రెడీ చేశారు అధికారులు. విచారణ మొత్తాన్నీ వీడియో తీసి, ఏసీబీ కోర్టుకు సమర్పిస్తారు.