చంద్రబాబును కలవనుంది వీరే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, ఇతర నేతల రాకతో సెంట్రల్ జైలు వద్ద హడావిడి వాతావరణం ఏర్పడింది. సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడును సెంట్రల్ జైలులో కలవనున్నారు.
ఇక సెంట్రల్ జైలు ప్రధాన వీధిలో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రతా సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జైలులో ప్రాణహాని ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వాదించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరుడు గట్టిన నేరస్తులు ఉన్నారని, వారివల్ల చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉండడంతో భారీ ఆంక్షలు విధించారు.
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పరిణామాలు చూసి తట్టుకోలేక ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారనే వార్తలు రావడంపై లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ జగన్ కక్ష పూరిత చర్య అని ఇప్పటికే దేశమంతా గుర్తించిందన్నారు. అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు.