Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. మంగళవారమయినా?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం అయినా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

Update: 2024-12-24 02:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం అయినా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. క్రిస్మస్ సెలవులు ఇవ్వడంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఈ ఏడాది చివరి వారం కావడంతో తిరుమలకు ఈ వారమంతా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే నెల నుంచి రద్దీ మరింత పెరగనుంది. వైకుంఠ ఏకాదశి ఉండటంతో జనం పోటెత్తుతతారు. అయితే తిరుమలలో దర్శనం సులువుగా అయ్యేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని లైన్లలో ప్రవేశపెట్టి సక్సెస్ అయితే వాటిని అమలు పర్చాలన్న ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులున్నారు. వసతి గృహాల వద్ద కూడా పెద్దగా వెయిట్ చేయకుండా సులువుగా దొరికేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లడ్డూల తయారీని పెంచడంతో భక్తులకు కావాల్సిన సంఖ్యలో లడ్డూలను ఇచ్చేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు నుంచి వచ్చే నెల వరకూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.


హుండీ ఆదాయం...

తిరుమల వెంకటేశ్వరుడిని ఈ మాసంలో దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా అయ్యప్ప స్వాములు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. అందుకే అందరికీ దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,656 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,360 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.




Tags:    

Similar News