బడ్జెట్ పై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు స్పందన ఇదే!!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్

Update: 2024-07-23 10:49 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులతో గ్రామీణ, పేదలు, రైతులు లబ్దిపొందుతారని.. విద్య, నైపుణ్యాల ప్రమాణాలను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యతరగతి జీవులకు కొత్త బలాన్ని ఇస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ బడ్జెట్ మహిళా కేంద్రీకృతమైదని, మహిళల సారధ్యంలో అభివృద్ధికి, శ్రామికశక్తిలో మహిళలను మరింత భాగస్వామ్యం చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త పన్ను విధానంలో నిబంధనలను సడలించడం ద్వారా పన్ను భారం తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించామని మోదీ తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, కొత్త స్టార్టప్‌ రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని తెలిపారు.
ఏపీ అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రంగం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం హర్షణీయమన్నారు. ఏపీ పునర్నిర్మాణం దిశగా కేంద్రం అందిస్తున్న ఈ సహకారం ఎంతగానో ఉపకరిస్తుందని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News