చంద్రబాబును అందుకే అరెస్ట్‌ చేశాం: సీఐడీ

నంద్యాలలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రరబాబును అరెస్టు చేశారు సీఐడీ పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు..

Update: 2023-09-09 03:00 GMT

నంద్యాలలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రరబాబును అరెస్టు చేశారు సీఐడీ పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు విషయంలో ఆయనను అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సీఐడీకీ ఫిర్యాదు చేశారు. అలాగే గతంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం 2021 జులైలో సీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ సీఐడీ నివేదిక ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ కేసులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌ కె.లక్ష్మీనారాయణలతో పాటు.. 26 మందిపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు విచారించారు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఇక టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలకు కూడా నిర్వహించారు. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది సీఐడీ. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని.. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. అయితే ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది.

అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు.. ప్రభుత్వానికి విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ వెల్లడించింది. 2017-18లో రూ.371 కోట్లలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది. అలాగే గతంలోనే సీఐడీ కేసులు నమోదు చేసిన 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేశామని సీఐడీ పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News