చంద్రబాబు పర్యటన.. ఓపెన్ టాప్ వాహనంలో వచ్చిన వైసీపీ నేతలు
చంద్రబాబు సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ వాహనంలో వచ్చిన వైసీపీ కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు. అనంతరం పులివెందుల బయల్దేరారు. చంద్రబాబు రాక నేపథ్యంలో, పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ వాహనంలో వచ్చిన వైసీపీ కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించారు. తమ సభ జరిగే చోట వైసీపీ జెండాలు ప్రదర్శిస్తుండడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జెండాలతో వచ్చిన ఆ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఇక కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జమ్మలమడుగు టీడీపీ నేత భూపేశ్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నాడని కొనియాడారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం తన కోసమే తాను పనిచేస్తాడని విమర్శించారు. ఆఖరికి చికెన్ షాపులో కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మన ఎమ్మెల్యే ఇలాంటివాడంటే సిగ్గనిపించడంలేదా? అని అన్నారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం చూస్తుంటే తనకు ఎలాంటి అనుమానం లేదని, వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో టీడీపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.