నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్
కిలో టమోటా రూ.150 నుండి రూ.180 పలుకుతుంటే.. మిర్చి ధర ఏకంగా రూ.200కు చేరింది. మిగతా కూరగాయల ధరలు..
నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయ్. సామాన్యుడు ఏం కొనాలో.. ఏం తినాలో తెలియని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో మాంసాహారమే కాదు.. కూరగాయల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. కిలో టమోటా రూ.150 నుండి రూ.180 పలుకుతుంటే.. మిర్చి ధర ఏకంగా రూ.200కు చేరింది. మిగతా కూరగాయల ధరలు రూ.50కు పైమాటే. ఆకుకూరల ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. నాన్ వెజ్ విషయానికొస్తే.. అందరికీ అందుబాటులో ఉండే చికెన్ ధరలు మే, జూన్ నెలల్లో అంతకంతకూ పెరుగుతూ రూ.350 వరకూ చేరింది. దాంతో.. చికెన్ ప్రియులు ఆందోళన చెందారు. తాజాగా మార్కెట్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు చనిపోవడం, కోళ్ల పెంపకం తగ్గడం, ఉన్నకోళ్లకు వేసే మేత ధరలు పెరగడం.. వెరసి కిలో చికెన్ ధర రూ.350 వరకూ పెరిగింది. ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కోళ్ల లభ్యత పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధర రూ.220-250కి దిగివచ్చింది. ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. రేపు ఆదివారం కావడంతో.. ముందుగానే చికెన్ ధరలు కాస్త తగ్గడంపై చికెన్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.