రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : చంద్రబాబు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మడకశిరలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏబీసీడీ వర్గీకరణ తొలుత ప్రవేశపెట్టింది తమ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. వారి మాయమాటలకు మోసపోవద్దని తెలిపారు. రాష్ట్రం మొత్తం అప్పులమయం చేశారని, సంపద సృష్టించడంపైనే తాను ప్రధానంగా దృష్టి పెట్టానని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని స్దాపించడం కోసమే తన ప్రయత్నమని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
గత ప్రభుత్వంలో...
గత ప్రభుత్వంలో సర్వే రాళ్ల కోసమే700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఐదేళ్లలో ప్రజలకు ఇళ్లు కట్టలేదు కానీ, రుషికొండలో ప్యాలెస్ కట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలన్నారు. అబద్ధాలను నమ్మకూడదన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనది అని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలను పండించుకోవచ్చని తెలిపారు. మడకశిరలో అరవై కోట్లు వెచ్చించి రింగ్ రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. రెండు రిజర్వాయర్లను ఈ ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పారు. భారీ వర్షంలోనూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.