ఎమ్మెల్యేగా చంద్రబాబు అన్‌ఫిట్... జగన్ ఫైర్
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి నాటి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి నాటి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబే నాశనం చేశారని జగన్ అన్నారు. పోలవరం నిర్వాసితులకు భూముల పరిహారంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రతి ఎకరాకు తాము పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. అందుకు సంబంధించి జీవో కూడా విడుదల చేశామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కాదు ఎమ్మెల్యేగా కూడా అన్‌ఫిట్ అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జగన్ టీడీపీ హయాంలో జరిగిన పనులు, వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు ఫొటోలు చూపించి వివరించారు.
పోలవరం పనులు...
పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు వేగంగా జరుగుతున్నాయని జగన్ తెలిపారు. 14,110 మంది నిర్వాసితులకు 19,060 కోట్లతో పునరావాసం కల్పిస్తున్నామని జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో చెప్పిన మాటను తాము నిలబెట్టుకుంటామని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. పునరావాసం పనులు పూర్తయిన వెంటనే పరిహారం అందిస్తామని తెలిపారు. కోట్లాది రూపాయలు బటన్ నొక్కుతనకు 500 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదని జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,900 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని, ఇది రాకపోవడానికి చంద్రబాబే కారణమని జగన్ ఆరోపించారు. నాడు కేంద్రాన్ని నిలదీయకుండా ఇప్పుడు ప్రశ్నించడమేంటని ఆయన నిలదీశారు.