Ys Jagan : ఈసారి ముందుగానే ఎన్నికలు... కేబినెట్ భేటీలో జగన్
మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికలు ముందే వస్తాయని చెప్పారు
మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలు జరిగిన సమయం కంటే ఇరవై రోజులు ముందే ఈసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. గెలుపు అవకాశాలున్న వారికే టిక్కెట్లు ఇస్తామని, టిక్కెట్లు దక్కని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామన్న భరోసా ముఖ్యమంత్రి జగన్ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఒకవర్గం చేసే మీడియా ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు పిలుపు నిచ్చారు. మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్తు కోతలు ఉండే అవకాశముందని, ముందుగానే అంటే ఫిబ్రవరి నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముఖ్య నిర్ణయాలివే...
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పింఛన్లను జనవరి నెల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ వర్తించేలా పథకాన్ని అమలు చేయనున్నట్లు జగన్ తెలిపారు. జనవరిలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలు చేస్తామని చెప్పారు. విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ కు మంత్రి వర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. జనవరి నెల నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ప్రారంభించాలని నిర్ణయించారు. ాదాయ, కుల ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు తెస్తూ నిర్ణయం తీసుకున్నారు.