రెండేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి
కడప స్టీల్ ప్లాంట్ తొలి దశ ఇరవై నాలుగు నెలల్లో పూర్తవుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ తొలి దశ ఇరవై నాలుగు నెలల్లో పూర్తవుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజను నిర్వహించారు. సున్నపురాళ్లపల్లిలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. 8,800 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ ను రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ ప్లాంట్ కు సపోర్టు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అయినా ఈరోజు మంచి రోజులు కడప ప్రజలకు వచ్చాయన్నారు. ఈ ప్లాంట్ కోసం 700 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ నిర్మితమవుతుందన్నారు.
రెండో దశ మాత్రం....
సెకండ్ ఫేజ్ ఐదేళ్లలో పూర్తవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 67వ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు రహదారిని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా రైల్వే లైన్ ఈ ప్లాంట్ కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరంతరం నీటి సదుపాయాన్ని కల్పంచేందుకు గండికోట రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీటిని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జగన్ అన్నారు. ఇందులో 75 శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జగన్ చెప్పారు. స్థానికులు కూడా కంపెనీ యాజమాన్యానికి సహకరించాలని జగన్ కోరారు.