లక్షిత ఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
తిరుమల కొండపైకి కాలి నడకన వెళ్తూ వన్య ప్రాణుల బారీన పడిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షిత ఘటనపై..
తిరుమల కొండపైకి కాలి నడకన వెళ్తూ వన్య ప్రాణుల బారీన పడిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షిత ఘటనపై దర్యాప్తు నివేదికను సమర్పించవలసిందిగా టీటీడీ,అటవీ,పోలీస్, రెవెన్యూ అధికారులకు ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు ఆదివారం ఆదేశాలను జారీ చేశారు.బాలికపై చిరుత దారుణంగా దాడిచేసిన సంఘటనతో పాటు, జూన్ 22 న కర్నూల్ జిల్లాకు చెందిన 4 ఏళ్ల కౌశిక్ కూడా తీవ్రంగా గాయపడిన విషయంలో తమను కలిచి వేసిందని,ఇటువంటి దురదృష్ట సంఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా తగు రక్షణ చర్యలు,జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు కాలినడకన తిరుమల దేవస్థానం చేరుకునే ప్రక్రియలో భాగంగా తక్షణమే పూర్తి స్థాయి నిఘా నీడలో సీసీ కెమెరాలు,ఇనుప స్తంబాలతో అమర్చిబడిన ఇనుప కంచెలు, విద్యుత్ దీపాలు,రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. కౌషిక్ సంఘటన జరిగిన తరువాత ఏమి చర్యలు తీసుకున్నారని, వన్య ప్రాణులకు సంబందించి పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని, జరిగిన సంఘటన పై పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు వారం రోజుల్లో సమర్పించాలని నాలుగు శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే చిరుత పులి ఘటనలో బాలిక మృతి చెందడం అందరిని కలిచివేసింది. అలాగే ఏడో మైలు రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది టీటీడీ. భక్తుల భద్రత నేపథ్యంలో ఇక నుంచి 40 అడుగులకు ఒక్క సెక్యూరిటీ టీమ్ భక్తులకు భద్రత కల్పించనుంది. భక్తుల భద్రతను సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇప్పటి వరకు 50 మందితో కూడిన భక్తులను గుంపులుగా పంపితే.. ఇక నుంచి 100 మంది ఉంటేనే పంపించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇదే అలిపిరి నడకదారిలో ఐదేళ్ల బాలుడు కౌశిక్‌పై కూడా చిరుత దాడి చేసింది. బాలుడి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.