ఏపీలో రోడ్లపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..!
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితి పై చిన్న జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితి పై చిన్న జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి ప్రయాణించేందుకు 3 గం.ల సమయం పట్టిందని చెప్పారు. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని.. ప్రయాణంలో ఇటువంటి ఇబ్బంది ఏర్పడడానికి బహుశా రోడ్ల మీద గోతులు ఎక్కువ ఉండవచ్చంటూ చిన్న జీయర్ స్వామి చలోక్తులు విసిరారు. 'ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చు.. ఒక్కోసారి గోతులు ఎక్కువగా ఉండొచ్చు.. మేం జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడికి దాకా రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేలా ఉంది' అంటూ భక్తులతో ఆయన చెప్పుకొచ్చారు.
కొద్దిరోజుల కిందట తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయగా.. వెంటనే వైసీపీ మంత్రులు, నేతలు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ వెనక్కు తగ్గారు. తాజాగా ఏపీలోని రోడ్ల పరిస్థితిపై చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు ఏమి చెబుతారో చూడాలి. ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో రాజమండ్రిలో చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు.
ఏపి లో రోడ్ల దుస్థితి పై చిన్న జీయర్ స్వామి చేసిన హాట్ కామెంట్స్ ను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా వాడుకుంటూ ఉన్నారు. "రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. పక్కరాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకి ఉదాహరణగా మన ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వ స్పందన శూన్యం. రాజకీయాలకు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి దగ్గర.. హిందూ ధర్మ ప్రచారమే జీవితలక్ష్యంగా సాగుతోన్న చిన జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారు. గతుకులు-గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే.. జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరం వరకూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందని రోడ్ల దుస్థితిని భక్తులకు చెబుతున్నట్టే ప్రవచనంలో భాగంగానే వ్యాఖ్యానించడం చూస్తుంటే.. జగన్‌రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా వున్నాయో స్పష్టం అవుతోంది" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. చినజీయర్ స్వామి వ్యాఖ్యలను కూడా తన ట్వీట్లలో భాగం చేశారు.