పేపర్ల లీకేజీ ఎప్పటి నుంచో.. ఆధారాలున్నాయ్.. చిత్తూరు ఎస్పీ సంచలనం

మాజీ మంత్రి నారాయణ అరెస్టుతో టెన్త్ పేపర్ల లీకేజీ ఎప్పటి నుంచో జరుగుతోందని ఎస్పీ తెలిపారు.

Update: 2022-05-10 12:56 GMT

ఏపీలో దుమారం రేపుతోన్న నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టుకు సంబంధించి చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతున్నట్లు తెలిసిందని.. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఎస్పీ చెప్పారు. చిత్తూరు పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. గత నెలలో తెలుగు క్వశ్చన్ పేపర్ లీకైన ఘటనపై చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు.

ఆ కేసులో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ చేశామని.. విచారణలో విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలిందని ఎస్పీ చెప్పారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. నారాయణ స్కూల్స్‌లో అడ్మిషన్స్ పెంచుకునేందుకు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. విద్యార్థుల్లో ఎవరు కాస్త చదువులో వెనకబడి ఉంటారో వాళ్లు పరీక్షలు రాసే కేంద్రాలు.. అక్కడి ఇన్విజిలేటర్ల వివరాలు ముందే తెలుసుకుంటారని ఎస్పీ తెలిపారు.

ఇన్విజిలేటర్లు ముందుగానే ప్రలోభాలకు గురిచేస్తారని.. డబ్బులు ఇస్తున్నట్లు కూడా గుర్తించామని ఎస్పీ చెప్పారు. అక్కడున్న ఉపాధ్యాయులతో పేపర్ లీక్ చేయించి సమాధానాలు రాసి పంపిస్తారన్నారు. పేపర్ లీకైన వెంటనే సమాధానాలు రెడీ చేసి వాటర్ బాయ్స్, అటెండర్స్, ఇన్విజిలేటర్ల ద్వారా విద్యార్ధులకు అందజేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాక్టీస్ జరుగుతోందని.. ఈసారి కూడా అలాగే చేద్దామనుకుని దొరికిపోయారని ఎస్పీ చెప్పారు.

ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని.. టెక్నికల్ ఆధారాలు, నిందితుల వాంగ్మూలం ఆధారంగా నారాయణను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నారాయణ అరెస్టు సహకరించారని.. ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. శ్రీచైతన్య, ఎన్నారై వంటి సంస్థల పేర్లు కూడా ఈ వ్యవహారంలో బయటికొచ్చాయని.. అయితే ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది గతంలో నారాయణలో పనిచేసిన సిబ్బందేనని ఎస్పీ తెలిపారు. ఆ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరిస్తామని చెప్పారు.

నారాయణ స్కూల్స్‌లో పిల్లలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వెనకబడి ఉంటారని.. సైన్స్, మ్యాథ్స్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తారని నిందితుల విచారణలో తెలిసిందన్నారు. అందుకే తెలుగు, హిందీ పేపర్లు లీక్ చేసినట్లుగా తెలుస్తోందన్నారు. ప్రధాన నిందితుడు గిరిధర్ అప్రూవర్‌గా మారారా? ఆయన ఏం వాంగ్మూలం ఇచ్చారనే ప్రశ్నలకు ఎస్పీ సమాధానాలు దాటవేశారు. కేసు విచారణ దశలో ఉందని.. ఇప్పుడే అన్నీ చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. నారాయణ భార్యను కూడా అరెస్టు చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. నారాయణ ఒక్కరినే అరెస్టు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. 

Tags:    

Similar News