ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్
మే28న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు సీఎం జగన్ హాజరవుతారు. ఆనంతరం పలువురు కేంద్ర మంత్రులతో..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ఈరోజు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 50,793 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు అందజేసిన అనంతరం తాడేపల్లిలో నివాసానికి చేరుకున్నారు. భోజన విరామ అనంతరం తాడేపల్లి నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. మూడ్రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలో బస చేయనున్నారు. రేపు అక్కడ జరిగే నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
మే28న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు సీఎం జగన్ హాజరవుతారు. ఆనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి తిరిగి గన్నవరం చేరుకుని, అక్కడి నుండి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా.. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంపై ఇప్పటికే భిన్నస్వరాలు వినిపించాయి. పార్లమెంట్ ను ప్రారంభించాల్సింది రాష్ట్రపతి అని, ఆమెకు ఆ గౌరవాన్ని ప్రధాని ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగితేనే తాము వస్తామని చెపుతూ 20 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.