జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో కేసు నమోదు చేసినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టినట్లు డేరంగుల ఉదయ్ కిరణ్ చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో డేరంగుల ఉదయ్ కిరణ్ ఈ వివరాలు వెల్లడించారు. విశాఖ ఘటన ద్వారా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ స్పందించి తమ ఫిర్యాదును విచారణకు స్వీకరించిందని తెలిపారు.
డేరంగుల ఉదయ్ కిరణ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ పై మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. 2016లో తిరుపతిలోని ఇందిరా మైదానంలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ కొన్ని కులాలు, మతాలను అవమానించారని అప్పట్లో ఉదయ్ కిరణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమీషన్లు తెచ్చి రిజర్వేషన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటే, వారి హక్కులను కాలరాసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కమిషన్‌ను కోరారు.