Andhra Pradesh : పీపీపీ ద్వారా రోడ్ల నిర్మాణం.. వర్క్ అవుటయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ లో రహదారుల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. పీపీపీ ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది

Update: 2024-10-12 07:06 GMT

 Roads in andhra pradesh 

ఆంధ్రప్రదేశ్ లో రహదారుల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీలో రోడ్లను నిర్మించకపోవడంతో ఓటమికి ఒక కారణంగా చెబుతారు. అనేక రహదారులు భారీ వర్షాలకు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రహదారుల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇందుకోసం నిధుల లేమి ప్రభుత్వాన్ని నాలుగు అడుగుల వెనక్కు నెడుతుంది. రహదారుల నిర్మాణం జరగాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి.

సొంత నిధులతో...
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రహదారుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖజానా బోసి పోయి ఉందని ఇప్పటికే అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రహదారుల నిర్మాణం చేపట్టకుంటే గత ప్రభుత్వం మాదిరిగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వీలయినంత త్వరగానే రహదారుల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రులను కలసి వచ్చినా కొన్ని జాతీయ రహదారుల విషయమయితే ప్రస్తావించారు కానీ, రాష్ట్ర పరిధిలో ఉండే రహదారులకు సంబంధించి మాత్రం నిధుల కొరత వెక్కిరిస్తూనే ఉంది.
పీపీపీ పద్ధతిలో...
దీంతో పబ్లిక్ - ప్రయివేటు - పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కింద రహదారుల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు ప్రాధమికంగా నిర్ణయించారు. అంటే ఈ విధానంలో ప్రయివేటు సంస్థలు ఈ రహదారులను నిర్మించాల్సి ఉంటుంది. వారే డబ్బులు రహదారుల నిర్మాణం కోసం ముందుగా వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ఆర్థిక వనరుల తప్ప మిగిలిన విషయాల్లో సాయం అందిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆర్‌ అండ్ బి, ఆర్థిక విభాగాల్లో నిపుణులు, ఇంజినీర్లు ఈ కమిటీలో ఉంటారు. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. పీపీపీ పద్ధతిలో రోడ్లు నిర్మించడం వల్ల ప్రజలపై భారం పడుతుంది.
ప్రజలకు భారమేగా?
ఇప్పుడు జాతీయ రహదారి తరహాలోనే రహదారిని నిర్మించిన సంస్థలు రాష్ట్ర స్థాయి రహదారుల్లోనూ టోల్ ఫీజు వసూలు చేస్తారు. అదే జరిగితే ప్రజలపై భారం పడుతుంది. ఇది మరింత ఇబ్బంది అవుతుందన్న వాదన కూడా లేకపోలేదు. కొన్నేళ్ల పాటు టోల్ ఫీజ్ వసూలు చేస్తారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలు టోల్ ఫీజ్ చెల్లించడంలో ఆర్థిక భారం పడుతుందని కూడా కొందరు అంటున్నారు. అయితే ఒక అభివృద్ధి పని జరగాలంటే అందులో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలు ఆ రహదారిని ఉపయోగించుకుంటున్నారు కనుక టోల్‌ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, దానివల్ల గ్రామాలు, మండలాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని చెబుతున్నారు. మరి ఈ పద్ధతికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా? లేదా? అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే కొన్నేళ్ల పాటు టోల్ ఫీజు వసూలు చేసుకునే వీలున్నా ప్రజలు ఏ మేరకు సహకరిస్తారన్న భయం వారిని వెంటాడుతుందంటున్న వాదన కూడా లేకపోలేదు.
Tags:    

Similar News