సీఎం కాకముందే 'జగన్' వారికంటే ధనవంతుడు : తులసిరెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ తులసిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ తులసిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన మండలి, వార్డు ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఓటమి పాలవడం పక్కా అని అన్నారు. రాష్ట్రంలో ఇసుక సహా ప్రకృతి వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయని విమర్శించారు. చెల్లెళ్లు షర్మిల, సునీతకు న్యాయం చేయలేని సీఎం.. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
జగన్ సీఎం కాకముందే దేశంలోని ముఖ్యమంత్రులందరి కంటే ధనవంతుడని తులసిరెడ్డి అన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. తనకు రూ. 370 కోట్ల ఆస్తులు ఉన్నట్టు జగన్ పేర్కొన్నారన్నారు. వైసీపీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా కోటీశ్వరులేనని.. వారిలో నలుగురు బిలియనీర్లు కూడా ఉన్నారని తెలిపారు. అయినా వైసీపీ పేదల పార్టీ అని అనడం విడ్డూరంగా ఉందన్నారు.