భక్తులకు ఊతకర్రల పంపిణీ.. విమర్శలపై స్పందించిన టీటీడీ చైర్మన్
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారు జామున చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలసి చైర్మన్ గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. తిరుమల అటవీ ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యచరణ రూపొందించి, అమలు చేస్తామన్నారు.
వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందని తెలిపారు. బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికారులు నిర్దారించారని వెల్లడించారు. భక్తులకు భద్రత కల్పిస్తూనే.. నడక మార్గంలోకి వచ్చే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ చెప్పారు.
భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. అటవీ శాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భక్తుల భద్రతలో భాగంగా అటవీ శాఖ సూచనల మేరకు అడవిలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 200 కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.