Tiruamala : తిరుమలలో రద్దీ నిల్... నేడు కూడా వేచి చూడకుండానే శ్రీవారి దర్శనం

తిరుమలలో రద్దీ పూర్తిగా తగ్గింది. బుధవారం కావడం, భారీ వర్షాల కారణంగా భక్తుల రాక తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు

Update: 2024-09-04 03:11 GMT

తిరుమలలో రద్దీ పూర్తిగా తగ్గింది. బుధవారం కావడం ఒక కారణమయితే భారీ వర్షాల కారణంగా భక్తుల రాక తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి ఐదో తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక కూడా భక్తులపై పనిచేసిందంటున్నారు. నిన్నటి వరకూ రైళ్లు, బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు రాలేదు. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో భక్తులు తిరుమలకు వచ్చేందుకు జంకుతున్నారు. అందువల్లనే గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారు మాత్రం వచ్చి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వెళుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

హుండీ ఆదాయం మాత్రం...
మూడు రోజుల నుంచి కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీధులన్నీ భక్తుల లేక బోసి పోతున్నాయి. భక్తుల సంఖ్య తగ్గడంతో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనూ నిత్యాన్నదానానికి రష్ లేదు. ఇక ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 57,817 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 17,592 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News