Tirumala : తిరుమలలో పూర్తిగా తగ్గిన రద్దీ... అసలు రీజన్ ఇదే

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. గురువారం అయినా భక్తులు పెద్దగా తిరుమలలో కనిపించడం లేదు;

Update: 2024-11-21 03:10 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. గురువారం అయినా భక్తులు పెద్దగా తిరుమలలో కనిపించడం లేదు. ఎక్కడ చూసినా తిరుమల వీధులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. కంపార్ట్ మెంట్లలో పెద్దగా భక్తులు వేచి ఉండకుండానే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి దర్శనం సులువుగా లభిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసం కావడంతో పాటు చలి తీవ్రత పెరగడంతో పాటు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి తిరిగి భక్తుల రాక మొదలవుతుందని అధికారులు భావిస్తున్నారు. భక్తులు తక్కువగా రావడంతో అన్న ప్రసాదాలతో పాటు లడ్డూ ప్రసాదాల తయారీని కూడా తగ్గించారు. అవి వృధా కాకుండా భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తే అధికారులు వాటి తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాలు కూడా సులువుగానే లభ్యమవుతున్నాయి.

ఆరు గంటల సమయం...
చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది వాయుగుండంగా మారి, తుపాను గా మారుతుందన్న సూచనలతో భక్తులు పెద్దగా రావడం లేదు. పొరుగున ఉన్న తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తుండటం కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండుగంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,231 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,029 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.08 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.



Tags:    

Similar News