Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2024-10-25 02:36 GMT

Tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. కంపార్ట్‌మెంట్లు కూడా పెద్దగా నిండలేదు. తుపాను కారణంతో భక్తులు తిరుమలకు చేరుకోలేక పోవడంతో భక్తుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో అనేక రైళ్లు రద్దు కావడం కూడా రద్దీ తగ్గడానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉంటుంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూ లైన్లు బయట వరకూ విస్తరించి ఉంటాయి. కానీ ఈరోజు శుక్రవారం అయినా భక్తుల రద్దీ లేకపోవడానికి భారీ వర్షాలు, తుపాను కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లడ్డూల సంఖ్య తయారీలో కొంత తగ్గించినట్లు కనపడుతుంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేకపోవడంతో అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

హుండీ ఆదాయం...
రేపు శనివారం కూడా భక్తుల రద్దీ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రెండు రోజుల పాటు దానా తుపాను ప్రభావం ఉండే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు మరో రెండు రోజులుంటాయని చెప్పడంతో ఇదే రద్దీ కొనసాగే అవకాశముంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని తొమ్మిది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,004 మంది దర్శించుకున్నారు. వీరిలో 20,173 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.48 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News